కలుషిత నీటితో గిరిపురంలో డయేరియా కలకలం: మల్లాది విష్ణు
గిరిపురంలో బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.. డ్రైనేజీ నిర్వహణలో అధికారుల వైఫల్యమే కారణమని ఆరోపణ.. ప్రజల ఆరోగ్య రక్షణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి..

విజయవాడ, జూలై 19: గిరిపురంలో డయేరియా వ్యాప్తిపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం మాజీ కార్పొరేటర్ కుక్కల అనితతో కలిసి ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించిన ఆయన, బాధిత కుటుంబాలను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ, కలుషిత తాగునీటి సరఫరా కారణంగానే గిరిపురంలో డయేరియా వ్యాప్తి చెందిందని ఆరోపించారు. తాగునీరు బాగుంటే అత్యవసరంగా క్యాన్ల ద్వారా నీటిని ఎందుకు సరఫరా చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. ప్రజల ఫిర్యాదులను పట్టించుకోకుండా ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు.
డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పరిసర ప్రధాన డ్రైన్‌ను సకాలంలో శుభ్రం చేయకపోవడం వల్లే వర్షపు నీరు నిలిచి సమస్యలు మరింత తీవ్రమయ్యాయని అన్నారు. పరిస్థితి విషమించిన తర్వాత వైద్య శిబిరాలు నిర్వహించడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రస్తుతం బాధితులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు, పారిశుధ్యాన్ని మెరుగుపరచి స్వచ్ఛమైన తాగునీరు అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్య సమస్యలపై ప్రభుత్వం స్పందించే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
