రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై శాకంబరీ మహోత్సవాలు.. కాయగూరలతో కనకదుర్గమ్మకు మహా అలంకారం
జులై 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు తొలి విడతగా 32 టన్నుల కూరగాయలు, మరో 4 టన్నుల పండ్లు సిద్ధం దర్శన సమయాల్లో ఎలాంటి మార్పు లేదన్న ఆలయ ఈవో శీనా నాయక్
విజయవాడ, జులై 26 (వి10టివి):
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు శాకంబరీ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారిని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో విశేషంగా అలంకరించే ఈ మహోత్సవాలు ఈ ఏడాదితో 19వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాయి.
ఎల్నినో ప్రభావంతో మార్కెట్లో కూరగాయల కొరత ఉన్నప్పటికీ, దేవస్థానం ప్రత్యేక బృందాలు రైతులు, వ్యాపారుల నుంచి విరాళాలు సేకరించి తొలి విడతగా 32 టన్నుల కూరగాయలు, ఆకుకూరలను ఇంద్రకీలాద్రికి చేర్చాయి. విజయవాడ హోల్సేల్ పండ్ల మార్కెట్ నుంచి మరో 4 టన్నుల పండ్లు కూడా చేరనున్నట్లు అధికారులు తెలిపారు.
రైతులు ఎంతో శ్రమతో అందించిన కూరగాయలు, పండ్లు వృథా కాకుండా ఆలయం వెలుపల అలంకరణల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఈవో వి.కె. శీనా నాయక్ తెలిపారు. ఇప్పటికే కాయగూరల దండలు సిద్ధం చేసి, ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు.
భూలోకంలో సకాలంలో వర్షాలు కురవాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సుఖసంతోషాలతో జీవించాలని సంకల్పంతో ఈ శాకంబరీ మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2007లో ప్రారంభమైన ఈ సంప్రదాయం గత 19 ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతోందని పేర్కొన్నారు.
మూడు రోజుల ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శన సమయాల్లో ఎలాంటి మార్పులు ఉండవని, సాధారణ రోజుల్లో మాదిరిగానే భక్తులకు దర్శనం కల్పిస్తామని ఈవో స్పష్టం చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందాలని ఆయన కోరారు.


