చిన్నారి చంద్రిక చికిత్సకు ప్రభుత్వం అండ.. బసవతారకం ఆస్పత్రిలో మంత్రి సత్యకుమార్ పరామర్శ
డిప్యూటీ సీఎం సూచనతో మంత్రి చొరవ.. బాలకృష్ణ ఆదేశాల మేరకు చికిత్స ప్రారంభం అన్నమయ్య జిల్లాకు చెందిన క్యాన్సర్ బాధిత చిన్నారికి ప్రత్యేక వైద్య సేవలు పేద రోగుల వైద్య సహాయంలో ప్రభుత్వం వెనుకాడదని మంత్రి స్పష్టం
చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
హైదరాబాద్, జూలై 26 (వి10టివి):
అన్నమయ్య జిల్లాకు చెందిన ఆరేళ్ల క్యాన్సర్ బాధిత చిన్నారి సాసాని చంద్రికకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఆదివారం హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌ను సందర్శించి చిన్నారి చంద్రికను, ఆమె తల్లి విజయమ్మను పరామర్శించారు.
ములకలచెరువుకు చెందిన ఆంజనేయులు, విజయమ్మ దంపతుల కుమార్తె చంద్రిక తల భాగంలోని కంటి కింద ప్రాంతంలో క్యాన్సర్ గడ్డతో బాధపడుతోంది. భర్తను కోల్పోయిన విజయమ్మ తన కుమార్తె చికిత్స కోసం మీడియా ద్వారా సహాయం కోరడంతో, ఉప ముఖ్యమంత్రి సూచన మేరకు మంత్రి సత్యకుమార్ స్పందించారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణను సంప్రదించి చిన్నారికి చికిత్స అందించాలని విజ్ఞప్తి చేయగా, వెంటనే ఆస్పత్రిలో

చేర్పించి అవసరమైన వైద్య సేవలు అందించాలని ఆయన ఆదేశించారు.
చిన్నారికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు తొలుత హెడ్ అండ్ నెక్ విభాగం ద్వారా శస్త్రచికిత్స చేసి, అనంతర ఫలితాల ఆధారంగా తదుపరి చికిత్స కొనసాగించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రావి శ్రీనివాసరావు నుంచి చికిత్స వివరాలను మంత్రి తెలుసుకుని అవసరమైన సూచనలు చేశారు.
పర్యటన సందర్భంగా ఆస్పత్రి ప్రాంగణంలోని స్వర్గీయ నందమూరి బసవతారకం, నందమూరి తారక రామారావు విగ్రహాలకు మంత్రి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆస్పత్రిలోని వైద్య సదుపాయాలను పరిశీలించి, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అందిస్తున్న సేవలను ప్రశంసించారు. పేద రోగులకు అవసరమైన వైద్య సహాయాన్ని అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడూ వెనుకాడదని మంత్రి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రావి శ్రీనివాసరావు, ఆస్పత్రి అధికారులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.


