టిప్పర్ డ్రైవర్లకు ట్రాఫిక్ సీఐ సురేష్ రోడ్డు భద్రత పాఠాలు
కొత్తపేట పరిధిలో టిప్పర్ డ్రైవర్లు, యజమానులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం... అతివేగం, ఓవర్‌లోడ్, మద్యం సేవించి డ్రైవింగ్‌పై సీఐ సురేష్ హెచ్చరిక.. వాహనాల ఫిట్‌నెస్, భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచన...
విజయవాడ, జూలై 23 (వి10టివి): ఎన్‌టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు, ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం ఆదేశాల మేరకు, ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు పర్యవేక్షణలో, ట్రాఫిక్ సీఐ సురేష్ ఆధ్వర్యంలో కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో టిప్పర్ లారీ యజమానులు, డ్రైవర్లకు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు...
ఈ సందర్భంగా సీఐ సురేష్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణలో టిప్పర్ డ్రైవర్ల బాధ్యత అత్యంత కీలకమని తెలిపారు. అతివేగం, ఓవర్‌లోడ్, నిర్లక్ష్యంగా వాహనం నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వంటి చర్యలు ప్రాణాంతక ప్రమాదాలకు కారణమవుతాయని హెచ్చరించారు...
వాహనాలను రోడ్డుపైకి తీసుకువెళ్లే ముందు బ్రేకులు, టైర్లు, స్టీరింగ్, హెడ్‌లైట్లు, ఇండికేటర్లు, రిఫ్లెక్టివ్ టేపులు, ఫిట్‌నెస్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్, పర్మిట్ తదితర అంశాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని సూచించారు. అలాగే ఇసుక, కంకర, మట్టి వంటి లోడ్లను తార్పాలిన్‌తో సక్రమంగా కప్పి తరలించాలని, రోడ్డుపైకి లోడ్ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు...
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేసిన సీఐ సురేష్, ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు...
కార్యక్రమంలో పాల్గొన్న టిప్పర్ లారీ యజమానులు, డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ సురక్షిత రవాణాకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసు సిబ్బంది కూడా పాల్గొన్నారు...

