కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ విద్య.. త్వరలో మరో డీఎస్సీ: మంత్రి సవిత
మెగా పీటీఎంతో విద్యార్థుల ప్రగతికి కొత్త ఊపు క్వాలిఫైడ్ టీచర్లు, సన్నబియ్యం భోజనం, తల్లికి వందనం ప్రభుత్వ ప్రత్యేకత వంద రోజుల యాక్షన్ ప్లాన్‌తో రికార్డు ఫలితాలు సాధించామని వెల్లడి
నర్సాపురం, జూలై 24 (వి10టివి): రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలోని తూర్పుతాళ్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ (మెగా పీటీఎం 4.0)లో ఎమ్మెల్యే బొమ్మడి నారాయణ నాయకర్‌తో కలిసి పాల్గొన్న మంత్రి సవిత, ప్రభుత్వ విద్య బలోపేతానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిఫైడ్ టీచర్లతో నాణ్యమైన బోధన, విశాలమైన తరగతి గదులు, క్రీడా మైదానాలు, సన్నబియ్యంతో రుచికరమైన మధ్యాహ్న భోజనం, విద్యామిత్ర కిట్లు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. త్వరలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.
తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా అందరికీ లబ్ధి చేకూరుస్తున్నామని, ఈ ఏడాది 67.47 లక్షల మంది విద్యార్థులకు రూ.10,120.78 కోట్లు విడుదల చేసి 42.70 లక్షల మంది తల్లుల ఖాతాల్లో జమ చేశామని మంత్రి వివరించారు. మెగా పీటీఎంల ద్వారా విద్యార్థుల విద్యా పురోగతి, మానసిక–శారీరక అభివృద్ధిపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి చర్చించే అవకాశం కలుగుతోందన్నారు.
గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన మంత్రి సవిత, జగన్ ప్రభుత్వం ప్రచారానికే ప్రాధాన్యం ఇచ్చిందని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ షైనింగ్ స్టార్స్ కార్యక్రమం, వంద రోజుల యాక్షన్ ప్లాన్ ద్వారా టెన్త్, ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిందన్నారు. ఎమ్మెల్యే బొమ్మడి నారాయణ నాయకర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లకు భారీ డిమాండ్ ఏర్పడిందని, కొన్ని పాఠశాలల్లో "నో అడ్మిషన్స్" బోర్డులు పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. అనంతరం మంత్రి సవిత విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.

