గోమాతకు రాష్ట్ర మాత హోదా కల్పించాలంటూ నేడు విజయవాడలో మహా సంకీర్తన ర్యాలీ
గో రక్షణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ కలెక్టర్కు వినతిపత్రం అందజేయనున్న గో భక్తులు 3.20 లక్షల సంతకాలతో ప్రభుత్వాన్ని కోరనున్న నిర్వాహకులు
విజయవాడ, జూలై 27: గోమాతను రాష్ట్ర మాతగా గుర్తించాలని, ఆంధ్రప్రదేశ్లో గోమాత రక్షణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్-2 ఆధ్వర్యంలో సోమవారం విజయవాడలో మహా సంకీర్తన ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు కోర్టు ఎదురుగా ఉన్న సీవీఆర్ స్కూల్ వద్ద ప్రారంభమయ్యే ఈ ర్యాలీ మ్యూజియం రోడ్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగనుంది.
ర్యాలీలో పాల్గొనే గో భక్తులు, గో ప్రేమికులు, గో సేవకులు హరినామ సంకీర్తన చేస్తూ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని తమ వినతిపత్రాన్ని అందజేయనున్నారు. గోమాతను రాష్ట్ర మాతగా గుర్తించాలని, గో రక్షణకు కఠిన చట్టాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
గో రక్షణ ఉద్యమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటికే 3,20,566 సంతకాలు సేకరించినట్లు వారు వెల్లడించారు. ఈ ఉద్యమానికి ప్రజలు, కుటుంబ సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై మద్దతు తెలపాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

