ఎల్‌నినోను ఎదుర్కోవడానికి రైతులకు 'పంచ సూత్రాలు'.. ఉద్యాన శాఖ కీలక సూచనలు
ఉద్యాన పంటల సంరక్షణకు శాస్త్రీయ విధానాలు పాటించాలని సూచన డ్రిప్, వీడ్ మ్యాట్లు, నీటి కుంటలపై భారీ రాయితీలు అందుబాటులో మిరప రైతులు జూలై 31లోగా పీఎం ఫసల్ బీమా ప్రీమియం చెల్లించాలని పిలుపు
విజయవాడ, 25 జూలై 2026 (వి10టివి):
ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు, దీర్ఘకాలం పొడి వాతావరణం ఏర్పడే అవకాశాల నేపథ్యంలో ఉద్యాన పంటలను శాస్త్రీయ పద్ధతులతో సంరక్షించుకోవాలని ఎన్‌టీఆర్ జిల్లా ఉద్యాన అధికారి పి. బాలాజీ కుమార్ రైతులకు సూచించారు. పంచ సూత్రాలను అమలు చేయడం ద్వారా నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ పంటల దిగుబడిని కాపాడుకోవచ్చని తెలిపారు.
పరిమిత నీటి వనరులున్న మామిడి తోటలు, ఆలస్యంగా మిరప సాగు చేసే ప్రాంతాల్లో ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్‌ను అమలు చేయాలని సూచించారు. అలాగే పప్పు, నూనెజాతి, ధాన్యజాతి, పచ్చిరొట్ట పంటలు వేయడం ద్వారా నేలలో తేమ ఎక్కువకాలం నిల్వ ఉండి పంటలకు మేలు జరుగుతుందని వివరించారు.
వర్షపు నీరు, బోరు నీటిని నీటి కుంటల్లో నిల్వ చేసి బిందు సేద్యం ద్వారా వినియోగిస్తే వర్షాభావ పరిస్థితులను అధిగమించవచ్చని తెలిపారు. నీటి కుంట నిర్మాణానికి అయ్యే రూ.18 వేల వ్యయంలో 50 శాతం వరకు ఉద్యాన శాఖ రాయితీ అందిస్తోందన్నారు.
ఈ ఖరీఫ్ సీజన్‌లో మిరప సాగు చేసిన రైతులు ఎకరాకు రూ.90 వేల బీమా రక్షణ పొందేందుకు జూలై 31లోగా రూ.1,800 ప్రీమియం చెల్లించి పీఎం ఫసల్ బీమా యోజనలో చేరాలని సూచించారు. తోటల్లో వీడ్ మ్యాట్లు పరచడం ద్వారా కలుపు నియంత్రణతో పాటు తేమను ఎక్కువకాలం నిల్వ ఉంచవచ్చని, ఇందుకు ఎకరానికి రూ.లక్ష వరకు రాయితీ అందుబాటులో ఉందన్నారు.
ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు కింద రైతుల అర్హతను బట్టి డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలపై 50 నుంచి 100 శాతం వరకు రాయితీ లభిస్తుందని తెలిపారు. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణానికి సాగునీరు అందించడంతో పాటు ఎరువులను నీటిలో కలిపి మొక్కలకు సమతుల్యంగా అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రైతులు తమ గ్రామంలోని రైతు సేవా కేంద్రాలు, ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించాలని జిల్లా ఉద్యాన అధికారి పి. బాలాజీ కుమార్ సూచించారు.


