సీనియర్ జర్నలిస్ట్ ఉరి వేసుకుని ఆత్మహత్య.. సెల్ఫీ వీడియోలో ఇద్దరిపై ఆరోపణలు
తాడేపల్లిగూడెంలో విషాద ఘటన.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని జర్నలిస్ట్ మృతి సెల్ఫీ వీడియోలో ఇద్దరు యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ల పేర్లు ప్రస్తావించినట్లు సమాచారం వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని పోలీసులు వెల్లడి
తాడేపల్లిగూడెం, జూలై 25 (వి10టివి):
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ఓ సీనియర్ జర్నలిస్ట్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. సీనియర్ జర్నలిస్ట్ ఉర్ల బాలకృష్ణ వర్ధన్ (36) తన హౌసింగ్ బోర్డు నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఆత్మహత్యకు ముందు వర్ధన్ ఓ సెల్ఫీ వీడియో రికార్డు చేసినట్లు సమాచారం. ఆ వీడియోలో తన మరణానికి ఇద్దరు యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్లే కారణమని పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వీడియోలోని ఆరోపణలపై పోలీసులు విచారణ చేపట్టారు.
సమాచారం అందుకున్న వెంటనే పట్టణ సీఐ బోణం ఆదిప్రసాద్, ఎస్సై బాదం శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతుడి సెల్ఫీ వీడియోతో పాటు ఇతర సాక్ష్యాలను పరిశీలిస్తున్నామని, అందుబాటులో ఉన్న ఆధారాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.
మరోవైపు, జర్నలిస్ట్ వర్ధన్ మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

