టమాటా ధరలపై తప్పుడు ప్రచారం.. రైతులను తప్పుదోవ పట్టించొద్దు: మంత్రి అచ్చెన్నాయుడు
టమాటా రైతులకు కిలోకు రూ.2 మాత్రమే వస్తోందన్న ప్రచారం అవాస్తవమని స్పష్టం జూలై 5 నుంచి 261 టన్నుల టమాటా కొనుగోలు చేసి రైతు బజార్లలో విక్రయిస్తున్న ప్రభుత్వం రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా మార్కెట్ పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ: మంత్రి
టమాటా ధరలపై వాస్తవాలను వక్రీకరిస్తూ కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. రైతులకు కిలోకు కేవలం రూ.2 మాత్రమే లభిస్తోందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో టమాటా సగటు ధర కిలోకు రూ.10.55గా ఉండగా, మదనపల్లె మార్కెట్లో రూ.11 వరకు ధర నమోదవుతోందన్నారు. వివిధ మార్కెట్లలో కనిష్టంగా రూ.6 నుంచి గరిష్టంగా రూ.16 వరకు ధరలు ఉన్నాయని వివరించారు.
రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం మార్కెట్ పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. అధిక దిగుబడుల నేపథ్యంలో సరఫరా, డిమాండ్ సమతుల్యం కోసం సాగు విస్తీర్ణ నియంత్రణ, దశలవారీ నాట్లు వంటి చర్యలు చేపట్టామని చెప్పారు. రాప్తాడు మార్కెట్లో భారీగా టమాటా రాకలు నమోదయ్యాయన్న ప్రచారం కూడా వాస్తవం కాదని, అక్కడ టమాటా రాకలే నమోదు కాలేదని స్పష్టం చేశారు.
ప్రభుత్వ మార్కెట్ జోక్య చర్యల్లో భాగంగా జూలై 5 నుంచి ఇప్పటివరకు 261 టన్నుల టమాటాను కొనుగోలు చేసి రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లలో 'నో లాస్–నో ప్రాఫిట్' విధానంలో విక్రయిస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. రైతుల సమస్యలను రాజకీయ ప్రచారానికి వాడుకోవడం కాకుండా వారికి అండగా నిలవాలని సూచించిన మంత్రి, నిరాధార ప్రచారాలను నమ్మి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.

