నిరసనల వెనుక కుట్ర కోణం
బీజేపీ వ్యక్తులపై సీజేపీ చీఫ్ ఆరోపణలు.. నిరసనల్లో చొరబాటుదారులే హింసకు కారణం.. సివిల్ డ్రెస్లో దాడులు జరిగాయన్న దీప్కే.. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమన్న సీజేపీ.. ఉద్యమాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ..
న్యూఢిల్లీ, జూలై 24 (వి10టివి): మహారాష్ట్రలో కొనసాగుతున్న నిరసనలపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చీఫ్ అభిజిత్ దీప్కే కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నిర్వహిస్తున్న నిరసనలను కొందరు బయటి వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా బీజేపీకి చెందిన కొందరు వ్యక్తులు నిరసనల్లో చొరబడి హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
నిరసనల సందర్భంగా కొందరు సివిల్ డ్రెస్సులో వచ్చి విద్యార్థులపై దాడులు చేస్తున్నారని అభిజిత్ దీప్కే ఆరోపించారు. శాంతియుతంగా జరుగుతున్న ఆందోళనలను హింసాత్మకంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
అయితే సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ముందుకు వస్తే చర్చలకు తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. నిరసనల్లో హింసకు కారణమైన వారిపై సమగ్ర దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

