నీటి కొరతతో అప్రమత్తమైన ప్రభుత్వం.. తాగునీటికే తొలి ప్రాధాన్యం
కృష్ణా డెల్టాలో తీవ్ర వర్షాభావం.. సాగునీటిపై ప్రభావం 2027 జూన్ వరకు తాగునీటి అవసరాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు సూచన
విజయవాడ, జూలై 24 (వి10టివి): రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, కృష్ణా నదిలో తగ్గిన నీటి లభ్యత దృష్ట్యా ప్రభుత్వం తాగునీటికే తొలి ప్రాధాన్యత ఇస్తోందని ఇరిగేషన్ శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్ (ఈఎన్సీ) కే. నరసింహమూర్తి తెలిపారు. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావంతో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సాధారణం కంటే వర్షపాతం గణనీయంగా తగ్గడంతో కృష్ణా నదిలోకి వచ్చే ప్రవాహాలు కూడా తగ్గిపోయాయని చెప్పారు.
రాష్ట్రంలో సాధారణం కంటే 51 శాతం, కృష్ణా డెల్టా పరిధిలో 49 శాతం వర్షపాతం లోటు నమోదైందన్నారు. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తక్కువగా ఉండటంతో దిగువ ప్రాంతాలకు నీటి విడుదలపై ప్రభావం పడిందని వివరించారు.
గ్రామాలు, పట్టణాలు, మున్సిపాలిటీల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని 2027 జూన్ వరకు నీటి నిర్వహణకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు. పులిచింతల ప్రాజెక్టులోని వినియోగించదగిన నీటిని కూడా తాగునీటి అవసరాల కోసమే భద్రపరిచినట్లు తెలిపారు. పట్టిసీమ ద్వారా ఆర్ఎంసీ కాల్వకు నీరు విడుదల చేస్తున్నప్పటికీ గోదావరి ప్రవాహాలు కూడా తగ్గుముఖం పట్టాయని చెప్పారు.
కృష్ణా డెల్టా సాగుకు సుమారు 150 టీఎంసీల నీరు అవసరమైనప్పటికీ ప్రస్తుతం అంత నీటి లభ్యత లేదని ఈఎన్సీ పేర్కొన్నారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని సుమారు 60 లక్షల మంది ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందుబాటులో ఉన్న నీటిని అత్యంత పొదుపుగా వినియోగిస్తున్నామని తెలిపారు. ఆర్ఎంసీ కాల్వ నుంచి అనధికారికంగా పంపులు ఏర్పాటు చేసి నీటిని తీసుకోవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో వరి సాగు చేపడితే మధ్యలో నీటి కొరతతో రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించిన నరసింహమూర్తి, వరికి బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. భవిష్యత్తులో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు నీటి ప్రవాహాలు పెరిగితే వ్యవసాయ శాఖతో చర్చించి పరిస్థితులకు అనుగుణంగా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.
అంతకుముందు సర్ ఆర్ధర్ కాటన్ వర్ధంతి సందర్భంగా ఇరిగేషన్ కాంపౌండ్‌లోని ఆయన విగ్రహానికి ఈఎన్సీ కే. నరసింహమూర్తి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

