పార్వతీపురానికి కుంకీ ఏనుగుల తరలింపు.. మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం
జయంత్, అభిమన్యులకు స్వయంగా ఆహారం అందించిన ఉప ముఖ్యమంత్రి గుచ్చిమి క్యాంపుకు జెండా ఊపి సాగనంపిన పవన్ కళ్యాణ్ మానవ-ఏనుగు ఘర్షణల నివారణకు కీలక అడుగు
విజయవాడ, జులై 24 (వి10టివి):
పార్వతీపురం మన్యం జిల్లాలో మానవ-ఏనుగు ఘర్షణలను తగ్గించే లక్ష్యంతో పలమనేరు ముసలమడుగు ఏనుగుల శిబిరం నుంచి గుచ్చిమి క్యాంపుకు తరలిస్తున్న శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు జయంత్, అభిమన్యులకు మంగళగిరిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. ఏనుగులకు పూలు చల్లి స్వాగతం పలికిన ఆయన, స్వయంగా ఆహారం అందించి, అనంతరం జెండా ఊపి గుచ్చిమి క్యాంపు వైపు సాగనంపారు.
ఈ సందర్భంగా కుంకీల భద్రతకు ప్రయాణమంతా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులకు సూచించిన పవన్ కళ్యాణ్, గుచ్చిమి శిబిరానికి చేరుకున్న తర్వాత అక్కడి వాతావరణానికి అలవాటు పడేలా నిపుణుల పర్యవేక్షణలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి తరచూ అడవి ఏనుగులు పార్వతీపురం మన్యం జిల్లాలోకి ప్రవేశించి పంటలు, ఆస్తులకు నష్టం కలిగిస్తున్న నేపథ్యంలో, మానవ-ఏనుగు ఘర్షణలను నివారించేందుకు ఈ కుంకీ ఏనుగులను వినియోగించనున్నట్లు తెలిపారు. ప్రజల భద్రత, రైతుల పంటల రక్షణతో పాటు వన్యప్రాణుల సంరక్షణను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం శాస్త్రీయ, మానవీయ విధానాలతో చర్యలు చేపడుతోందన్నారు.
గతంలో పలమనేరు, చిత్తూరు ప్రాంతాల్లో నిర్వహించిన పలు ఆపరేషన్లలో జయంత్, అభిమన్యులు అడవి ఏనుగుల గుంపులను సురక్షితంగా అటవీ ప్రాంతాలకు మళ్లించడంలో కీలక పాత్ర పోషించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా ఈ కుంకీ ఏనుగుల సేవలను వినియోగించనున్నారు.

