పంచాయతీ పోరులో.. చిటికెన వేలికే సిరా!
చూపుడు వేలికి బదులు చిటికెన వేలిపై గుర్తు... గందరగోళానికి తావులేకుండా ఎన్నికల సంఘం నిర్ణయం... మూడు విడతల పోలింగ్‌కు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు...

అమరావతి, నవంబర్ 14 : ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సిరా గుర్తు వేసే విధానంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక మార్పు చేసింది. ఈసారి ఓటు హక్కు వినియోగించుకున్న వారి ఎడమ చేతి చిటికెన వేలిపై చెరగని సిరా గుర్తు వేయాలని ఆదేశించింది. ఇటీవల నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్ల చూపుడు వేలికి సిరా గుర్తు వేయడంతో ఆ గుర్తులు ఇంకా చెరిగిపోని పరిస్థితి నెలకొంది. దీంతో పంచాయతీ ఎన్నికల సమయంలో ఎలాంటి గందరగోళం తలెత్తకుండా చిటికెన వేలికి సిరా వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 26, 29 తేదీలతో పాటు డిసెంబర్ 2న మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ నూతన విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఎన్నికల సంఘం సూచించింది.

