లాడ్జిలో మహిళ హత్య.. మిస్టరీగా మారిన మరణం!
రెండు రోజులుగా అదృశ్యం.. లాడ్జి గదిలో విగతజీవిగా... యువకుడితో కలిసి వచ్చిన ఎర్రమ్మ.. గదికి తాళం వేసి పరారీ... సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి కోసం పోలీసుల గాలింపు...

విజయవాడ, నవంబర్ 14 : విజయవాడ నగరంలో ఓ మహిళ హత్య తీవ్ర కలకలం రేపింది. రెండు రోజులుగా కనిపించకుండా పోయిన వివాహిత ఓ లాడ్జి గదిలో విగతజీవిగా కనిపించడం సంచలనం సృష్టించింది. కృష్ణలంక పరిధిలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ ఎదురుగా ఉన్న రామయ్య లాడ్జిలో శుక్రవారం ఈ ఘటన వెలుగుచూసింది. మృతురాలిని పైడిశెట్టి ఎర్రమ్మగా పోలీసులు గుర్తించారు. కనిపించడం లేదని ఫిర్యాదు.. అంతలోనే విషాదం! ఎర్రమ్మ రెండు రోజులుగా కనిపించకపోవడంతో ఆమె భర్త సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్న సమయంలో రామయ్య లాడ్జిలో మృతదేహం లభ్యమైంది. దీంతో అదృశ్యం కేసు హత్య కేసుగా మారింది. యువకుడితో లాడ్జికి.. ఆ తర్వాత ఏం జరిగింది? పోలీసుల ప్రాథమిక విచారణలో ఎర్రమ్మ ఓ యువకుడితో కలిసి లాడ్జికి వచ్చినట్లు వెల్లడైంది. గదిలో ఆమెను హత్య చేసిన అనంతరం తలుపులకు తాళం వేసి ఆ యువకుడు పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అసలు ఎర్రమ్మతో వచ్చిన యువకుడు ఎవరు? హత్యకు దారితీసిన కారణాలేమిటి? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. సీసీ కెమెరాలపై పోలీసుల దృష్టి! ఘటనపై సమాచారం అందుకున్న కృష్ణలంక, సూర్యారావుపేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లాడ్జి పరిసరాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ అనుమానితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. హత్య వెనుక అసలు కారణాలు, నిందితుడి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

