గన్నవరం క్రీడాకారుల సత్తా.. రాష్ట్ర పోటీలకు ఎనిమిది మంది ఎంపిక
అమరావతి కప్–2026 అండర్-17 విభాగంలో ప్రతిభ... జిల్లా స్థాయి పోటీల్లో సత్తా చాటిన గన్నవరం క్రీడాకారులు... ఎంపికైన విద్యార్థులను అభినందించిన క్రీడాభిమానులు...

గన్నవరం: అమరావతి కప్–2026 వాలీబాల్ అండర్-17 విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలకు గన్నవరం నియోజకవర్గానికి చెందిన ఎనిమిది మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. ఇటీవల గుడివాడలో నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో గన్నవరం నియోజకవర్గ బాలుర జట్టు ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఈ మేరకు గన్నవరం నియోజకవర్గ స్పోర్ట్స్ ఇన్‌చార్జి ధనియాల నాగరాజు మంగళవారం వివరాలు వెల్లడించారు. జిల్లా స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన గన్నవరం నియోజకవర్గానికి చెందిన ఎనిమిది మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు.
ఎంపికైన వారిలో బాలుర విభాగం నుంచి సీహెచ్ హర్షవర్ధన్, జి. రంజిత్, బి. కిరణ్, టి. బాబు ఉండగా, బాలికల విభాగం నుంచి సీహెచ్ సుప్రజ కుమారి, సీహెచ్ మాధవి, జి. మౌనిక, సీహెచ్ సుకన్య ఉన్నట్లు పేర్కొన్నారు.
ఈ ఎనిమిది మంది క్రీడాకారులు త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో కృష్ణా జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు నాగరాజు తెలిపారు. జిల్లా స్థాయిలో రాణించి రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులను పలువురు ప్రశంసించారు.
గన్నవరం నియోజకవర్గానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిన విద్యార్థులను వారి వ్యాయామ విద్య ఉపాధ్యాయులు అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ ఇదే ఉత్సాహంతో ఆడి విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు.

