గ్రామాల్లో తగ్గిన నిరుద్యోగ రేటు
జూలైలో గ్రామీణ నిరుద్యోగం 4.5 శాతానికి తగ్గుదల.... పట్టణాల్లో మాత్రం 6.7 శాతానికి పెరిగిన నిరుద్యోగ రేటు.... దేశవ్యాప్తంగా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు 55.4 శాతానికి చేరిక....

దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు తగ్గినట్లు నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) సర్వే వెల్లడించింది. జూలైలో దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు 5.1 శాతానికి తగ్గగా, అంతకుముందు ఇది 5.5 శాతంగా నమోదైంది.
గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 5 శాతం నుంచి 4.5 శాతానికి తగ్గడం గమనార్హం. అయితే పట్టణ ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. పట్టణ నిరుద్యోగ రేటు 6.6 శాతం నుంచి 6.7 శాతానికి స్వల్పంగా పెరిగినట్లు గణాంకాలు వెల్లడించాయి.
దేశవ్యాప్తంగా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు 55.4 శాతానికి చేరింది. మహిళల భాగస్వామ్యం కూడా మెరుగుపడగా, గ్రామీణ ప్రాంతాల్లో మహిళల లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు 38.8 శాతంగా నమోదైనట్లు ఎన్ఎస్ఓ గణాంకాలు వెల్లడించాయి.

