విజయవాడలో అగ్నికీలల్లో అంబులెన్స్!
కొత్త ప్రభుత్వాసుపత్రి సమీపంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు… దట్టమైన పొగలతో రోగులు, స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు… షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమిక అనుమానాలు…

విజయవాడ, నవంబర్ 7 : విజయవాడ నగరంలో శనివారం అంబులెన్స్ అగ్నిప్రమాదానికి గురైన ఘటన కలకలం రేపింది. కొత్త ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్) సమీపంలోని డెంటల్ కళాశాల వద్ద నిలిపి ఉంచుతున్న అంబులెన్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు వాహనం మొత్తానికి వ్యాపించడంతో అంబులెన్స్ అగ్నికీలల్లో చిక్కుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం డెంటల్ ఆసుపత్రి గోడకు ఆనుకొని అంబులెన్స్‌ను పార్కు చేస్తుండగా వాహనం లోపలి నుంచి దట్టమైన పొగలు వెలువడ్డాయి. ఆ వెంటనే మంటలు ఎగసిపడటంతో అక్కడున్న ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. నిత్యం రోగులు, వారి బంధువులతో రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంటలను గమనించిన స్థానికులు అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే చర్యలు చేపట్టారు. అంబులెన్స్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. ఘటన సమయంలో అంబులెన్స్‌లో రోగులు ఉన్నారా, ఎవరికైనా గాయాలయ్యాయా, వాహనానికి ఎంత మేర నష్టం వాటిల్లిందనే వివరాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.

