కెమెరా నుంచి కెరీర్ దాకా.. కంటెంట్ ల్యాబ్
యువత, మహిళలు, విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ తయారీలో శిక్షణ... వీడియో రికార్డింగ్, ఎడిటింగ్, లైవ్ స్ట్రీమింగ్‌పై అవగాహన... స్థానిక ప్రతిభకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం...

విజయవాడ, సెప్టెంబరు 8: ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంటెంట్ క్రియేషన్ స్టూడియో, ల్యాబ్‌లను యువత, మహిళలు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సూచించారు.
వీడియో రికార్డింగ్, వీడియో ఎడిటింగ్, లైవ్ స్ట్రీమింగ్ తదితర అంశాల్లో ఈ కేంద్రం ద్వారా శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. డిజిటల్ రంగంలో ఆసక్తి ఉన్నవారికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ సదుపాయం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువతలో సృజనాత్మకత, డిజిటల్ నైపుణ్యాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక ప్రతిభను ఉపాధి అవకాశాలుగా మలచడంతో పాటు జిల్లాలోని పర్యాటక, సాంస్కృతిక విశేషాలను డిజిటల్ వేదికల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఈ కేంద్రాన్ని వినియోగించాలని సూచించారు.

