ప్రజా తీర్పే శిరోధార్యం.. ఓడినా ప్రజాసేవ ఆగదు!
గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజల మధ్యే ఉంటా... బుడమేరు సమస్య పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తా... వైద్యసేవల కోసం 24 గంటలూ అందుబాటులో ఉంటా: డాక్టర్ వెంకట చరణ్ తేజ...

విజయవాడ, నవంబర్ 4 : ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 1వ డివిజన్ ఇన్చార్జి డాక్టర్ వెంకట చరణ్ తేజ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పటికీ ప్రజాసేవలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. తనను ఆదరించిన ప్రజలకు, గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం 1వ డివిజన్ వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ప్రజలతో తన అనుబంధం కొనసాగుతుందని, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 24 గంటలూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. తనపై నమ్మకంతో పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూ, పార్టీ సిద్ధాంతాలను, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తానన్నారు. బుడమేరు సమస్యపై ప్రత్యేక దృష్టి డివిజన్ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న బుడమేరు సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేస్తానని వెంకట చరణ్ తేజ తెలిపారు. ప్రజలకు ఎదురయ్యే సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. వైద్యసేవల్లో వెనకడుగు వేయను వైద్య వృత్తి ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం తనకు లభించడం అదృష్టంగా భావిస్తున్నానని డాక్టర్ వెంకట చరణ్ తేజ అన్నారు. 1వ డివిజన్ పరిధిలోని ప్రజలకు వైద్యపరంగా ఎలాంటి అవసరం వచ్చినా తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ, ఎన్నికల సమయంలో తనకు అండగా నిలిచిన నాయకులు, కార్యకర్తలకు మరోసారి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ఓటమితో ప్రజలతో తన ప్రయాణం ముగిసిపోదని, మరింత బాధ్యతతో ప్రజల మధ్య ఉంటానని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

