బందరులో కాకరేపుతున్న ‘మేయర్’ రాజకీయం!
మచిలీపట్నం మేయర్ అభ్యర్థిగా బండి రామకృష్ణ పేరు ప్రచారంతో జనసేనలో విభేదాలు... ‘గతంలోనే మేయర్ అభ్యర్థిగా హామీ ఇచ్చారు’ అంటూ కోట వెంకట్రావు అభ్యంతరం... పవన్ బర్త్డే వేడుకల సమావేశం పేరుతో పాత విభేదాలు మరోసారి తెరపైకి...

మచిలీపట్నం: మచిలీపట్నం మేయర్ అభ్యర్థి వ్యవహారం జనసేనలో రాజకీయ వేడిని పెంచుతోంది. మేయర్ అభ్యర్థిగా బండి రామకృష్ణ పేరును ఆ పార్టీ టౌన్ అధ్యక్షుడు ప్రకటించారన్న ప్రచారంతో పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడుతున్నాయి.
తనకు గతంలోనే మేయర్ అభ్యర్థిగా హామీ ఇచ్చారని జనసేన నేత కోట వెంకట్రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. తనను కాదని మరో వ్యక్తి పేరును తెరపైకి తీసుకురావడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన సమావేశం పేరుతో పార్టీలో కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలు మరోసారి తెరపైకి వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మేయర్ అభ్యర్థిత్వంపై పార్టీ నుంచి అధికారిక నిర్ణయం రాకముందే పేర్ల ప్రకటనలు చేయడం ఏమిటన్న ప్రశ్నలు కూడా పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి.
ఈ పరిణామాలతో మచిలీపట్నం జనసేనలో మేయర్ అభ్యర్థిత్వం ఎవరికి దక్కుతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. బండి రామకృష్ణ పేరుపై వస్తున్న ప్రచారం, కోట వెంకట్రావు అభ్యంతరాల నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందన్నది చర్చనీయాంశమైంది. అయితే అభ్యర్థిత్వంపై పార్టీ అధికారిక నిర్ణయం వెలువడాల్సి ఉంది.

