ప్రియుడి కత్తిపోట్లకు ప్రియురాలు బలి!
జంగారెడ్డిగూడెంలో యువతిపై కత్తితో దాడి… తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ స్వప్న మృతి… దాడి అనంతరం పరారైన రామకృష్ణ కోసం పోలీసుల గాలింపు…

ఏలూరు జిల్లా, అక్టోబర్ 31: ప్రేమ వ్యవహారంలో తలెత్తిన విభేదాలు ఓ యువతి ప్రాణాలను బలిగొన్నాయి. తనను ప్రేమించిన వ్యక్తే కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పోలవరం మండలం తంగేడికొండ గ్రామానికి చెందిన స్వప్న (29) జంగారెడ్డిగూడెంలో అద్దె ఇంట్లో నివసిస్తూ స్థానికంగా ఓ బేకరీలో పనిచేస్తోంది. శుక్రవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై చాకుతో విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో పడి ఉన్న స్వప్నను గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. తొలుత జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం స్వప్న ప్రాణాలు కోల్పోయింది. జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై వీరప్రసాద్ బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. తనను ఇష్టపడిన వ్యక్తే కత్తితో పొడిచాడని స్వప్న పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. రామకృష్ణ, స్వప్న కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న రామకృష్ణ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.

