వృద్ధుడి ఖాతాకు సైబర్ గండి.. రూ.24 లక్షలు మాయం!
బ్యాంకు ఖాతా నుంచి అనుమతి లేకుండానే నగదు బదిలీ… రెండు విడతల్లో రూ.4 లక్షలు, రూ.20 లక్షలు మాయం… సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు…

విజయవాడ, నవంబర్ 11 : విజయవాడలో సైబర్ నేరగాళ్ల మోసానికి ఓ వృద్ధుడు భారీ మొత్తంలో నగదు కోల్పోయినట్లు ఫిర్యాదు చేశారు. ఏజెన్సీపేటకు చెందిన ఓ వృద్ధుడి బ్యాంకు ఖాతా నుంచి ఏకంగా రూ.24 లక్షలు ఇతర ఖాతాలకు బదిలీ అయిన ఘటన వెలుగులోకి వచ్చింది. తన అనుమతి లేకుండానే నగదు బదిలీ కావడంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడికి ఇండస్ఇండ్ బ్యాంకులో ఖాతా ఉండగా, అందులో రూ.24 లక్షలు జమ చేసి ఉన్నారు. అయితే ఆయనకు తెలియకుండానే తొలుత రూ.4 లక్షలు, అనంతరం రూ.20 లక్షలు వేర్వేరు బ్యాంకు ఖాతాలకు బదిలీ అయినట్లు గుర్తించారు. ఖాతాలోని నగదు మాయమైన విషయం తెలుసుకున్న బాధితుడు ఆందోళనకు గురయ్యారు. తాను ఎలాంటి లావాదేవీలకు అనుమతి ఇవ్వలేదని, తన ఖాతా నుంచి నగదు అక్రమంగా బదిలీ అయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగదు ఏ ఖాతాలకు బదిలీ అయింది, ఈ లావాదేవీల వెనుక ఎవరున్నారు, మోసం ఎలా జరిగిందనే అంశాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. బాధితుడి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫొటో రైట్అప్: విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్స్టేషన్. వృద్ధుడి ఖాతా నుంచి రూ.24 లక్షలు మాయమైన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు.

