ప్రపంచ పెట్టుబడులకు విశాఖ వేదిక!
రేపటి నుంచి రెండు రోజులపాటు 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు… 58 దేశాల ప్రతినిధులు.. 16 మంది విదేశీ మంత్రుల రాక… అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభం.. ఉపరాష్ట్రపతి సమక్షంలో ముగింపు…

విశాఖపట్నం, నవంబర్ 11 : ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ప్రభుత్వ ప్రతినిధులకు విశాఖపట్నం వేదిక కానుంది. ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ పెట్టుబడులు, వాణిజ్యం, సాంకేతిక భాగస్వామ్యాలకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు గురువారం ప్రారంభం కానుంది. నవంబర్ 12, 13 తేదీల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించే ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 58 దేశాల నుంచి సుమారు 3,800 మంది ప్రతినిధులు పాల్గొననున్నట్లు అంచనా. వీరిలో 16 మంది విదేశీ మంత్రులు, 40 మంది అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు ఉండనున్నారు. ప్రముఖుల రాకతో ప్రత్యేక ఆకర్షణ సదస్సు ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. నవంబర్ 13న జరిగే ముగింపు కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పాల్గొననున్నారు. ప్రపంచ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. ఆరు అంశాలపై కీలక చర్చలు ‘నేవిగేటింగ్ ది న్యూ వరల్డ్ ఆర్డర్: ట్రేడ్, టెక్నాలజీ, ట్రస్ట్ అండ్ థాట్ లీడర్షిప్’ ప్రధాన ఇతివృత్తంతో సదస్సు జరగనుంది. ప్రపంచ వాణిజ్యం, పెట్టుబడులు, గ్లోబల్ వాల్యూ చైన్స్, అంతర్జాతీయ ఆర్థిక సహకారం, వ్యవసాయం, ఆహార భద్రత, యువత నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలు, భవిష్యత్ పరిశ్రమలు, స్వచ్ఛ ఇంధనం, సుస్థిర అభివృద్ధి వంటి అంశాలపై చర్చలు నిర్వహించనున్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రాధాన్యం సీఐఐ సదస్సుకు సమాంతరంగా ‘ఏపీ ఉమెన్ అండ్ గ్రోత్ సమ్మిట్–2026’ నిర్వహించనున్నారు. మహిళా సాధికారత, పారిశ్రామిక రంగంలో మహిళల భాగస్వామ్యం, పెట్టుబడుల సమీకరణ, వ్యాపార అవకాశాల విస్తరణపై ప్రత్యేక చర్చలు జరగనున్నాయి. మహిళా పారిశ్రామికవేత్తలను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. పెట్టుబడుల ఒప్పందాలపై భారీ ఆశలు ప్రధాన సదస్సుకు ముందుగా నిర్వహించిన ప్రాంతీయ సన్నాహక సమావేశాల ద్వారా రూ.86,522 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రెండు రోజుల ప్రధాన సదస్సులో 400కు పైగా వ్యాపార సమావేశాలు నిర్వహించాలని ప్రణాళిక రూపొందించింది. ప్రభుత్వాలు, పరిశ్రమల ప్రతినిధులు, అంతర్జాతీయ పెట్టుబడిదారుల మధ్య ప్రత్యక్ష చర్చలు జరగనున్నాయి. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి అవకాశాల పెంపు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీకి సంబంధించి కీలక ఒప్పందాలు కుదిరే అవకాశాలున్నాయి. విశాఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు సదస్సు ప్రారంభానికి ఒకరోజు ముందుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం విశాఖపట్నం చేరుకునేలా పర్యటన ఖరారైంది. అంతకుముందు అమరావతిలో సింగపూర్ ప్రతినిధులతో సమావేశమై, విశాఖలో పలువురు విదేశీ ప్రతినిధులతో పెట్టుబడుల అవకాశాలపై చర్చించనున్నారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు ఒప్పందాలను కార్యరూపంలోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది.

