కాలుష్యపు కౌగిలిలో దేశ రాజధాని!
ఢిల్లీని కమ్మేసిన విషపూరిత వాయువులు.. ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారిన పరిస్థితులు… ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం.. 402కు చేరిన గాలి నాణ్యత సూచీ… ఢిల్లీ–ఎన్‌సీఆర్ పరిధిలో గ్రాప్-3 ఆంక్షలు.. కాలుష్య నియంత్రణకు కఠిన చర్యలు…

న్యూఢిల్లీ, నవంబర్ 13: దేశ రాజధాని ఢిల్లీని తీవ్ర వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శుక్రవారం ఉదయం నగరమంతా దట్టమైన పొగమంచు, కాలుష్యపు పొర కమ్ముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 402కు చేరుకోవడంతో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకరమైన 'తీవ్ర' కేటగిరీలోకి ప్రవేశించింది. నగరంలోని 58 పర్యవేక్షణ కేంద్రాల్లో 33 చోట్ల తీవ్ర కాలుష్య స్థాయులు నమోదయ్యాయి. ఐఐటీ ఢిల్లీ ప్రాంతంలో ఏక్యూఐ 487కు చేరగా, చాందినీ చౌక్, నార్త్ క్యాంపస్ ప్రాంతాల్లో 476గా నమోదైంది. కాలుష్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ–ఎన్‌సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్) మూడో దశ నిబంధనలు అమల్లో కొనసాగుతున్నాయి. నవంబర్ 6 నుంచే ఈ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ ప్రకటించింది. గాలిలో కాలుష్య కారకాలు పేరుకుపోకుండా నిర్మాణ పనులు, వాహనాల వినియోగం తదితర అంశాలపై పరిమితులు విధించింది.

