ప్రశ్నాపత్రం పాతదే.. పరీక్ష మాత్రం కొత్తదా!
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరీక్షల నిర్వహణలో తీవ్ర వైఫల్యమని ఆరోపణలు… జనవరిలో ఇచ్చిన ప్రశ్నలే నవంబర్లోనూ.. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా… బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలి.. సమగ్ర విచారణకు డా. అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్ డిమాండ్…

విజయవాడ, నవంబర్ 13: డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నిర్వహించిన ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ పరీక్షల్లో ఒకే ప్రశ్నాపత్రాన్ని యథాతథంగా పునరావృతం చేయడంపై వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా డాక్టర్స్ వింగ్ చైర్మన్ డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరిలో నిర్వహించిన ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ పేపర్-2లో ఇచ్చిన ప్రశ్నలనే నవంబర్ పరీక్షలోనూ ఇవ్వడం విశ్వవిద్యాలయ పరీక్షల నిర్వహణలోని నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి వైద్య కళాశాలల్లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా? సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యలో అత్యున్నత అర్హతలను నిర్ణయించే పరీక్షల నిర్వహణలో ఇటువంటి పొరపాట్లు చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళనకరమని రాధాకృష్ణ యాదవ్ పేర్కొన్నారు. దీనిని సాధారణ పరిపాలనా పొరపాటుగా పరిగణించి వదిలేయడం సరికాదన్నారు. కష్టపడి చదివే విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించాల్సిన విశ్వవిద్యాలయమే పరీక్షల విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసే పరిస్థితులు కల్పించడం దురదృష్టకరమని విమర్శించారు. బాధ్యులపై సస్పెన్షన్ వేటు వేయాలి ప్రశ్నాపత్రాల రూపకల్పన, పరిశీలన, ఆమోదం, పరీక్షల నిర్వహణలో భాగస్వాములైన అధికారుల పాత్రపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రాథమికంగా బాధ్యత ఉన్నట్లు తేలిన అధికారులను విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయాలని కోరారు. ఒకే ప్రశ్నాపత్రం పునరావృతం కావడానికి గల కారణాలు, నిబంధనల ఉల్లంఘన, విద్యార్థులకు అనుచిత ప్రయోజనం కలిగే అవకాశాలపై నిష్పక్షపాత దర్యాప్తు జరపాలన్నారు. విచారణ నివేదికను బహిర్గతం చేయాలి ఈ ఘటనపై విశ్వవిద్యాలయ వైస్‌ఛాన్సలర్ తక్షణమే స్పందించాలని రాధాకృష్ణ యాదవ్ కోరారు. పరీక్షా రికార్డులు, ప్రశ్నాపత్రాల రూపకల్పనకు సంబంధించిన ఆధారాలను భద్రపరచడంతో పాటు విచారణ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యానికి విద్యార్థులను బాధ్యులను చేయకుండా వారి విద్యా ప్రయోజనాలను పరిరక్షించాలన్నారు. వైద్య విద్యా పరీక్షల విశ్వసనీయత విషయంలో రాజీపడే ప్రసక్తే ఉండకూడదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

