అభివృద్ధి ప్రచారం.. అంకెల గారడీ!
చంద్రబాబు చెబుతున్న లెక్కలకు.. వాస్తవాలకు పొంతన లేదన్న జగన్... విద్యుత్ డిమాండ్ తగ్గుదల.. పన్నుల ఆదాయంలో అంతంతమాత్రపు వృద్ధి... అవినీతి, నిరుద్యోగాన్ని కప్పిపుచ్చేందుకే ప్రచార ఆర్భాటాలంటూ విమర్శలు...

అమరావతి, నవంబర్ 13: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి ప్రచారంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి, క్షేత్రస్థాయిలో నెలకొన్న వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదని ఆరోపించారు. గురువారం సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన.. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తున్నప్పటికీ అంకెల గారడీతో అభివృద్ధి జరుగుతున్నట్లు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కూటమి పాలనలో అవినీతి, అరాచకాలు పెరిగిపోయాయని, శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అభివృద్ధి పేరుతో ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ వినియోగమే ఆర్థిక పరిస్థితికి నిదర్శనం! రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మందగమనానికి విద్యుత్ డిమాండ్ తగ్గుదలే నిదర్శనమని జగన్ పేర్కొన్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో డిస్కంల విద్యుత్ విక్రయాలు 71,722 మిలియన్ యూనిట్లుగా ఉండగా, 2025–26 నాటికి 70,885 మిలియన్ యూనిట్లకు తగ్గాయని వివరించారు. పరిశ్రమలు విస్తరిస్తున్నప్పుడు విద్యుత్ వినియోగం పెరగాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా తగ్గిపోవడం ఆర్థిక కార్యకలాపాల మందగమనాన్ని సూచిస్తోందని అభిప్రాయపడ్డారు. పన్నుల ఆదాయంలో పురోగతి ఎక్కడ? రాష్ట్ర సొంత పన్నుల ఆదాయంలో ఆశించిన స్థాయిలో వృద్ధి కనిపించడం లేదని జగన్ విమర్శించారు. 2023–24లో రూ.85,922 కోట్లుగా ఉన్న పన్నుల ఆదాయం 2025–26లో రూ.86,552 కోట్లకు మాత్రమే చేరిందని పేర్కొన్నారు. ఈ గణాంకాలు రాష్ట్రంలో వినియోగం, పెట్టుబడుల పరిస్థితిపై సందేహాలను రేకెత్తిస్తున్నాయని అన్నారు. ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆదాయ వృద్ధి ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగాల కల్పనపై జగన్ ప్రశ్నాస్త్రాలు! రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగ అవకాశాలు అందడం లేదని ఆరోపిస్తూ, 23 లక్షల ఉద్యోగాలు కల్పించామంటూ చంద్రబాబు చేస్తున్న ప్రకటనలను ప్రశ్నించారు. ఉద్యోగాల కల్పనకు సంబంధించి స్పష్టమైన ఆధారాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి ప్రకటనలతో సరిపెట్టకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, ఉపాధి అవకాశాల వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. ప్రచారంతో వాస్తవాలను కప్పిపుచ్చలేరని జగన్ విమర్శించారు.

