రివార్డ్ పాయింట్ల ఎర.. విశ్రాంత బ్యాంకు మేనేజర్‌కే టోకరా!
SBI రివార్డ్ పాయింట్ల పేరుతో నకిలీ మెసేజ్.. లింక్ క్లిక్ చేయడంతో మోసం రూ.14 వేల పాయింట్లు వినియోగించుకోవచ్చంటూ వల.. రెండు విడతల్లో సుమారు రూ.3 లక్షలు డెబిట్ బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పటమట పోలీసులు

విజయవాడ క్రైమ్ ఆగస్టు 20 (ఆంధ్రప్రభ): సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడతో ప్రజల ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. చివరకు బ్యాంకింగ్ రంగంలో పనిచేసి పదవీ విరమణ చేసిన వ్యక్తిని సైతం రివార్డ్ పాయింట్ల పేరుతో బురిడీ కొట్టించారు. విజయవాడ నాగార్జుననగర్‌కు చెందిన విశ్రాంత బ్యాంకు మేనేజర్ రాజేంద్ర సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకుని సుమారు రూ.3 లక్షలు నష్టపోయారు.
ఈ నెల 17న రాజేంద్ర సెల్‌ఫోన్‌కు SBI రివార్డ్ పాయింట్ల పేరుతో ఓ మెసేజ్ వచ్చింది. తన ఖాతాలో రూ.14 వేల విలువైన రివార్డ్ పాయింట్లు ఉన్నాయని, వాటిని అదే రోజు వినియోగించుకోవాలని అందులో పేర్కొన్నారు. ఇందుకోసం మెసేజ్‌లో ఓ లింక్‌ను కూడా పంపించారు.
అది నిజమైన బ్యాంకు సందేశమేనని భావించిన రాజేంద్ర లింక్‌ను క్లిక్ చేసి అందులో అడిగిన వివరాలను నమోదు చేసినట్లు సమాచారం. కొద్దిసేపటికే ఆయన బ్యాంకు ఖాతా నుంచి రెండు విడతల్లో సుమారు రూ.3 లక్షలు డెబిట్ అయినట్లు గుర్తించారు. దీంతో తాను సైబర్ మోసానికి గురైనట్లు తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.
ఘటనపై రాజేంద్ర పటమట పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నగదు ఏ ఖాతాలకు బదిలీ అయింది, నకిలీ లింక్‌ను ఎవరు పంపించారు అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
బ్యాంకులు, రివార్డ్ పాయింట్లు, KYC అప్డేట్ పేర్లతో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. బ్యాంకు పేరుతో సందేశం వచ్చినప్పటికీ అధికారిక యాప్ లేదా వెబ్సైట్ ద్వారానే వివరాలను ధృవీకరించుకోవాలని చెబుతున్నారు.

