క్లిక్ చేసే ముందు ఆలోచించండి.. సైబర్ మోసానికి చెక్ పెట్టండి!
రోజుకో కొత్త ఎత్తుతో సైబర్ నేరగాళ్లు.. జాగ్రత్తగా ఉండాలి: సీఐ పవన్ కిషోర్ ఓటీపీ, ఏటీఎం పిన్, సీవీవీ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా 1930కు సమాచారం ఇవ్వాలి

విజయవాడ, ఆగస్టు 27: అప్రమత్తతతో సైబర్ నేరాలను సమర్థంగా అరికట్టవచ్చని పటమట సీఐ పవన్ కిషోర్ అన్నారు. గురువారం ఆటోనగర్‌లోని స్టాలిన్ కార్పొరేట్ కార్యాలయంలో పలు ప్రభుత్వ కార్యాలయాల అధికారులు, సిబ్బందికి సైబర్ క్రైమ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ పవన్ కిషోర్ మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పద్ధతిలో మోసాలకు పాల్పడుతున్నారని, ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంకు అధికారులు, పోలీసుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్‌తో పాటు కేవైసీ అప్డేట్ పేరుతో వచ్చే లింకులు, మెసేజ్‌ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీ, ఏటీఎం పిన్, సీవీవీ, బ్యాంకు ఖాతా వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దన్నారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయడం, తెలియని యాప్‌లను డౌన్లోడ్ చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించిన వెంటనే ఆలస్యం చేయకుండా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు 1930 హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని సూచించారు. సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవడమే మోసగాళ్ల నుంచి రక్షణ పొందేందుకు ప్రధాన ఆయుధమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ అనూష, పోలీసు సిబ్బంది వెంకటేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

