రేషన్ బియ్యం వద్దంటే.. ఖాతాలో డబ్బులు!
ఏపీలో సీబీడీసీ విధానం అమలుకు ప్రభుత్వం కసరత్తు గుజరాత్ ప్రయోగంపై అధ్యయనం చేసిన రాష్ట్ర అధికారులు విశాఖలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసే యోచన

అమరావతి, ఆగస్టు 27: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ పంపిణీ వ్యవస్థలో కొత్త విధానాన్ని తీసుకురావడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రేషన్ కార్డుదారుల్లో బియ్యం తీసుకోని వారికి దాని బదులుగా నగదు ప్రయోజనం అందించేలా సీబీడీసీ (సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ) విధానాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న నేపథ్యంలో అక్కడి అమలు తీరును అధ్యయనం చేసేందుకు ఇటీవల ఏపీ అధికారులు గుజరాత్ వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడి అనుభవాలు, సాంకేతిక అంశాలు, లబ్ధిదారులకు ప్రయోజనం అందించే విధానాన్ని పరిశీలించినట్లు సమాచారం. ఏపీలో తొలుత విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని అమలు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పైలట్ ఫలితాల ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే రేషన్ బియ్యానికి బదులుగా ఎంత మొత్తం అందిస్తారు, ఎవరు అర్హులు, సీబీడీసీ ద్వారా నగదు ప్రయోజనం ఎలా అందుతుంది వంటి అంశాలపై అధికారిక విధివిధానాలు వెలువడాల్సి ఉంది. త్వరలో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
