నున్నలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి భారీ చేరికలు!
మాజీ సర్పంచ్ కాటూరి సరళ సహా సుమారు 100 మంది టీడీపీలో చేరిక... పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు... పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపు...

విజయవాడ, అక్టోబర్ 27 : విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. గ్రామ మాజీ సర్పంచ్ కాటూరి సరళతో పాటు సుమారు 100 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. విజయవాడలోని కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నచ్చి తాము టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ నాయకత్వంతో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కొత్తగా పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. గ్రామస్థాయిలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. నాయకుల మధ్య సమన్వయం పెంపొందించుకుంటూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. పార్టీ పాత, కొత్త నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడు తగరం కిరణ్‌బాబు, గ్రామ పార్టీ అధ్యక్షుడు కలకతోటి శ్రీనివాస్‌రెడ్డి, మాదు శివరామకృష్ణ, పోలారెడ్డి సాంబిరెడ్డి, గంపా శ్రీనివాస్, పామర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

