ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పు!
నవంబర్ 5న పోలింగ్.. 6న అవసరమైన చోట రీపోలింగ్... నవంబర్ 7న ఓట్ల లెక్కింపు.. అనంతరం ఫలితాల ప్రకటన... సవరించిన షెడ్యూల్‌ను వెల్లడించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీశ...

విజయవాడ, అక్టోబర్ 28: రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సాధారణ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను సవరించినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 5వ తేదీ గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఏవైనా కారణాలతో రీపోలింగ్ అవసరమైన ప్రాంతాల్లో నవంబర్ 6వ తేదీ శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. నవంబర్ 7వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలను ప్రకటిస్తామని కలెక్టర్ తెలిపారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఒకే రోజున జరగాల్సి ఉండటంతో ఎన్నికల సంఘం షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు వివరించారు. పోలీసు బందోబస్తు, పోలింగ్ సిబ్బంది కేటాయింపు, ఇతర ఎన్నికల నిర్వహణ వనరుల సమర్థ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సవరించిన షెడ్యూల్‌కు అనుగుణంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల తేదీల్లో మార్పులపై గ్రామీణ ప్రాంతాల ఓటర్లకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. పోలింగ్, రీపోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియలు సజావుగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. సవరించిన ఎన్నికల షెడ్యూల్ ప్రక్రియ తేదీ సమయం పోలింగ్ నవంబర్ 5, గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు రీపోలింగ్ నవంబర్ 6, శుక్రవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు ఓట్ల లెక్కింపు నవంబర్ 7, శనివారం ఉదయం 8 గంటల నుంచి

