విజయదశమి వేళ భక్తులకు వేడి పాలతో సేద!
దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులకు క్యూలైన్లలో వేడి పాల పంపిణీ… ఈవో శీనా నాయక్ ఆదేశాలతో ప్రత్యేక ఏర్పాట్లు… హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సేవకుల సేవలకు భక్తుల ప్రశంసలు…

విజయవాడ, అక్టోబర్ 20: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి తరలివచ్చిన భక్తులకు హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వేడి పాలను పంపిణీ చేశారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు ఈ సేవలు ఉపశమనం కలిగించాయి. దుర్గగుడి కార్యనిర్వహణాధికారి శీనా నాయక్ ఆదేశాల మేరకు వినాయకుడి గుడి వద్ద నుంచి కొండపైకి వెళ్లే క్యూలైన్లలో భక్తులకు వేడి పాలు అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పాల పంపిణీ కొనసాగించాలని ఈవో సూచించారు. ఈవో సూచనలతో హెల్పింగ్ హాండ్స్ నిర్వాహకుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవకులు రంగంలోకి దిగారు. పాలను ఎప్పటికప్పుడు వేడి చేస్తూ క్యూలైన్లలో ఉన్న భక్తులకు అందజేశారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, మహిళలకు ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా నిలిచాయి. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు సేవ చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామని హెల్పింగ్ హాండ్స్ చంద్రశేఖర్ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం నిరంతరం సేవలు అందించేందుకు తమ బృందం కృషి చేస్తోందన్నారు. విజయదశమి రోజున క్యూలైన్లలో వేడి పాలు అందించడం పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. స్వచ్ఛంద సేవకుల సేవాభావాన్ని అభినందించడంతో పాటు భక్తుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టిన ఈవో శీనా నాయక్‌ను ప్రశంసించారు.

