కృష్ణా జిల్లాలో ఎన్నికలకు ఖాకీ కవచం!
1,266 పోలింగ్ కేంద్రాలపై పోలీసుల ప్రత్యేక నిఘా... 2,500 మంది భద్రతా సిబ్బందితో భారీ బందోబస్తు... ఓటర్లను బెదిరించినా, ప్రలోభాలకు గురిచేసినా ఉపేక్షించేది లేదు: ఎస్పీ విద్యాసాగర్ నాయుడు...

మచిలీపట్నం, నవంబర్ 4: కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా వ్యాప్తంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. మొత్తం 1,266 పోలింగ్ కేంద్రాల పరిధిలో 2,500 మంది పోలీస్, ఇతర భద్రతా సిబ్బందిని మోహరించేందుకు చర్యలు తీసుకుంది. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు వెల్లడించారు. అడుగడుగునా పోలీసుల నిఘా ఎన్నికల బందోబస్తును ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు. ఇద్దరు అదనపు ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 37 మంది సీఐలు, ఆర్ఐలు, 88 మంది ఎస్ఐలు, ఆర్ఎస్ఐలతో పాటు ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. మహిళా సంరక్షణ కార్యదర్శులు, ఎన్ఎస్ఎస్ సిబ్బందిని కూడా ఎన్నికల విధుల్లో వినియోగించుకోనున్నారు. అవసరమైన చోట పదవీ విరమణ పొందిన ఆర్మీ, పోలీస్ సిబ్బంది సేవలను ఉపయోగించుకోనున్నారు.సీసీ కెమెరాలు.. డ్రోన్లతో పర్యవేక్షణ పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ద్వారా పరిస్థితులను పర్యవేక్షించడంతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా కొనసాగించనున్నారు. ముఖ్యంగా సున్నితమైన పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయనున్నారు. ఎక్కడైనా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తితే తక్షణమే స్పందించేలా పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రలోభాలకు పాల్పడితే కఠిన చర్యలు ఓటర్లను డబ్బు, మద్యం లేదా ఇతర మార్గాల్లో ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించినా, బెదిరింపులకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. ఓటు హక్కు వినియోగించుకునే ప్రజలకు ఎలాంటి ఆటంకాలు కలిగించరాదని స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళిని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రశాంత ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.

