దసరాకు ఇప్పటి నుంచే పక్కా ప్లాన్
పెరిగే భక్తుల రద్దీకి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేయాలి: ఈవో శీనా నాయక్ అన్ని విభాగాల ప్రతిపాదనలు సిద్ధం చేసి కమిషనర్ కార్యాలయానికి పంపాలని ఆదేశం సెప్టెంబర్ 3న ట్రస్ట్ బోర్డు కీలక సమావేశం

ఇంద్రకీలాద్రి, ఆగస్టు 29: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అత్యంత వైభవంగా నిర్వహించే దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు–2026కు ఇప్పటి నుంచే పకడ్బందీగా సన్నద్ధం కావాలని ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
దసరా ఉత్సవాల ముందస్తు ప్రణాళికపై శుక్రవారం సాయంత్రం మహామండపం నాలుగో అంతస్తులోని నూతన సమావేశ మందిరంలో ఈవో అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. దేవస్థానంలోని వివిధ విభాగాల అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది, వైదిక కమిటీ సభ్యులతో దసరా ఏర్పాట్లు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సమగ్రంగా చర్చించారు.
గత ఏడాదితో పోలిస్తే ఈసారి శరన్నవరాత్రి ఉత్సవాలకు దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఈవో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా క్యూలైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, నిరంతర ప్రసాద వితరణ, వైద్య సదుపాయాల విషయంలో ఎక్కడా లోటుపాట్లు తలెత్తకుండా ముందుగానే కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేయాల్సిన తాత్కాలిక షెడ్లు, విద్యుద్దీపాలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై ఆయా విభాగాలు పూర్తిస్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. వాటిని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయ ఆమోదానికి త్వరితగతిన పంపాలని స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 3న జరగనున్న దేవస్థాన ధర్మకర్తల మండలి (ట్రస్ట్ బోర్డు) సమావేశం కీలకం కానుంది. దసరా మహోత్సవాలకు సంబంధించిన ప్రతిపాదనలు, నిర్ణయాలను బోర్డు ఆమోదం కోసం సమావేశంలో ఉంచనున్నట్లు ఈవో వెల్లడించారు.
అమ్మవారి నవరాత్రోత్సవాల నిర్వహణలో ప్రతి విభాగం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అధికారుల మధ్య సమన్వయం అత్యంత కీలకమని శీనా నాయక్ సూచించారు.
సమీక్షలో ఆలయ డిప్యూటీ ఈవో, అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, వైదిక కమిటీ సభ్యులు, వివిధ విభాగాల పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.

