మాయమాటలకు లొంగితే.. ఖాతా ఖాళీ!
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలి: పటమట సీఐ పవన్ కిషోర్... ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దు... సైబర్ నేరాలతో పాటు మహిళల భద్రతపై వాకర్స్‌కు పోలీసుల అవగాహన...

విజయవాడ, ఆగస్టు 29: సైబర్ నేరగాళ్లు చెప్పే మాయమాటలకు మోసపోకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పటమట సీఐ పవన్ కిషోర్ సూచించారు. పటమటలంకలోని అవధూత ఆశ్రమంలో శుక్రవారం సాయంత్రం వాకర్స్‌కు సైబర్ నేరాలు, మహిళల భద్రతపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ పవన్ కిషోర్ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పద్ధతిలో ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. బ్యాంకు అధికారులు, ప్రభుత్వ సంస్థల ప్రతినిధుల పేరుతో వచ్చే అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు, లింకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఓటీపీ, ఏటీఎం పిన్, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయవద్దని, అనుమానాస్పద యాప్‌లను మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవద్దని హెచ్చరించారు.
సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించిన వెంటనే ఆలస్యం చేయకుండా 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. సకాలంలో స్పందించడం ద్వారా నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందని వివరించారు.
మహిళలు, బాలికల భద్రతకు పోలీసులు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని సీఐ తెలిపారు. ఎలాంటి వేధింపులు ఎదురైనా భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మహిళలపై నేరాల నివారణలో ప్రజల సహకారం కూడా కీలకమన్నారు.
కార్యక్రమంలో ఎస్ఐ సీతారామ్, పోలీసు సిబ్బంది, వాకర్స్ పాల్గొన్నారు.

