జింజేరు రైతుల గుండెచప్పుడు వినేదెవరు?
ఎకరానికి రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టామంటున్న రైతులు... టెయిల్‌ఎండ్‌కు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్... నీరివ్వలేకపోతే క్రాప్ హాలిడే ప్రకటించి ఎకరానికి రూ.50 వేల పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి...

మచిలీపట్నం: పెడన మండలం జింజేరు గ్రామంలో సాగునీటి సమస్య రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కాలువ నీరు ఇప్పటికీ పొలాలకు చేరకపోవడంతో సాగు చేసిన వరి ఎండిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎకరానికి సుమారు రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టామని, నీరు అందకపోతే పెట్టుబడి మొత్తం నష్టపోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు.
జింజేరు గ్రామం కాలువ టెయిల్‌ఎండ్‌లో ఉండటమే తమకు శాపంగా మారిందని రైతులు చెబుతున్నారు. ఎగువ ప్రాంతాల్లోని రైతులు కాలువలో వచ్చిన నీటిని మోటార్లు, ఇంజిన్ల ద్వారా తోడుకోవడంతో దిగువ ప్రాంతమైన జింజేరుకు చుక్కనీరు కూడా చేరడం లేదని ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా పర్యవేక్షించాలని కోరుతున్నారు.
ఈ ప్రాంతంలోని భూములు ఆరుతడి పంటలకు అనుకూలంగా లేవని, ప్రధానంగా వరి సాగుపైనే ఆధారపడాల్సి వస్తోందని రైతులు పేర్కొన్నారు. మరోవైపు వ్యవసాయ పనులు లేక రైతు కూలీలకు ఉపాధి దొరకడం లేదని, ఉపాధి హామీ పనులు కూడా ఆశించిన స్థాయిలో లేక కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాలువ నీటిని తక్షణమే జింజేరు వరకు తీసుకురావాలని, అది సాధ్యం కాని పరిస్థితిలో క్రాప్ హాలిడే ప్రకటించి ఎకరానికి రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
పెట్టుబడుల కోసం చేసిన అప్పులు ఒకవైపు, పంట ఎండిపోతుందన్న భయం మరోవైపు తమను తీవ్రంగా వేధిస్తున్నాయని రైతులు తెలిపారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి సాగునీరు అందించి తమను ఆదుకోవాలని కోరారు.

