సేవా–సంక్షేమంలో ఎమ్మెల్యే సౌమ్య బిజీబిజీ
విభిన్న ప్రతిభావంతులకు నూతన స్కూటీల పంపిణీ... పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాల ప్రారంభం... జుజ్జూరులో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల అందజేత...

నందిగామ, సెప్టెంబర్ 2: సేవా, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం మంజూరు చేసిన నూతన స్కూటీలను పంపిణీ చేయడంతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాలను ప్రారంభించారు. జుజ్జూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు.
నందిగామలో అర్హులైన విభిన్న ప్రతిభావంతులకు స్కూటీలను అందజేసిన సౌమ్య, వారి విద్య, ఉపాధి అవసరాలకు ఈ వాహనాలు ఉపయోగపడాలని ఆకాంక్షించారు.
పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని నందిగామతో పాటు వీరులపాడు మండలం జుజ్జూరులో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాలను ఆమె ప్రారంభించారు. రక్తదానం ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడే గొప్ప సేవ అని, యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
అనంతరం జుజ్జూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
కార్యక్రమాల్లో జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, తంబాలపల్లి రమాదేవి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

