కూటమికి ఎదురులేదు.. ప్రతిపక్షానికి డిపాజిట్లు కూడా రావు: ఎమ్మెల్యే రాము
గుడివాడ రూరల్‌లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన వెనిగండ్ల రాము… పని చేసే వారికే ఓటు వేయండి.. చేయని వారిని తిరస్కరించండి… జడ్పీటీసీ అభ్యర్థి అంగడాల భారతి, కూటమి ఎంపీటీసీలను గెలిపించాలని పిలుపు…

గుడివాడ రూరల్, అక్టోబర్ 31: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ఎదురులేదని, ప్రతిపక్ష అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేసే నాయకులను ఎన్నుకుంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. శనివారం గుడివాడ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పర్నాస, కల్వపూడి అగ్రహారం, చౌటపల్లి, సిద్ధాంతం, వేల్పూరు, దింటకుర్రు గ్రామాల్లో ఏపీ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రాబి వెంకటేశ్వరరావుతో కలిసి ఎమ్మెల్యే రాము పర్యటించారు. టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి అంగడాల భారతి, కూటమి ఎంపీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఆయా గ్రామాల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కాలినడకన, ద్విచక్ర వాహనంపై గ్రామాల్లోని మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లిన ఎమ్మెల్యే రాము స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. గ్రామ కూడళ్లలో ప్రచార రథంపై నుంచి ప్రసంగిస్తూ ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ కూటమి పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీ కార్యకర్తలు ప్రజల పక్షాన నిలబడతారని పేర్కొన్నారు. గత వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన రాము, అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలను పట్టించుకోని నాయకులు ఎన్నికల సమయంలో మాయమాటలతో ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు. పని చేసే వారికి ఓటు వేయాలని, పని చేయని వారిని తిరస్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలకు మేలు చేసే నాయకులను గెలిపించినప్పుడే గ్రామాల ప్రగతి మరింత ముందుకు సాగుతుందన్నారు. ఈ ప్రచారంలో జడ్పీటీసీ అభ్యర్థి అంగడాల భారతి, ఎంపీటీసీ అభ్యర్థులు పట్టం అంజయ్య, ఎన్. నిర్మల, వీరవరపు నాగజ్యోతి, రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు వాసే మురళి, బీజేపీ నాయకుడు అంగడాల సతీష్, టీడీపీ నాయకులు నిమ్మగడ్డ సత్యసాయి, కర్రే వెంకటగిరి, అంగడాల వీర్రాజు, లింగం ప్రసాద్, బండి మధు, దేవరపల్లి కోటి, గండికోట గోపి తదితర నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
