విజయవాడలో ఎన్నికల వేళ ఖాకీ హెచ్చరిక.. నగదు పంచితే కఠిన చర్యలు!
లయోలా కళాశాల వద్ద పోలీసుల భారీ బందోబస్తు… 450 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట భద్రతా ఏర్పాట్లు… ఓటర్లకు డబ్బులు పంచితే ఉపేక్షించేది లేదన్న సెంట్రల్ ఏసీపీ దామోదర్…

విజయవాడ, అక్టోబర్ 31: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విజయవాడలో పోలీసు యంత్రాంగం భద్రతా చర్యలను ముమ్మరం చేసింది. నగరంలోని లయోలా కళాశాల వద్ద పోలింగ్, నగరవ్యాప్తంగా కౌంటింగ్ ఏర్పాట్లలో భాగంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్లు సెంట్రల్ ఏసీపీ దామోదర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 450 మంది పోలీసు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేలా నగదు పంపిణీ చేసినా, ఇతర రూపాల్లో ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల నాయకులు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం అందితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఏసీపీ దామోదర్ విజ్ఞప్తి చేశారు.

