చంద్రబాబు నాయకత్వంలో విజయవాడ అభివృద్ధికి మహర్దశ: బొండా ఉమా
మౌలిక సదుపాయాలు, వరద నివారణకు భారీగా నిధులు… డ్రైనేజీ, రహదారులు, స్టేడియం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం… ఆధునిక నగరంగా విజయవాడను తీర్చిదిద్దడమే లక్ష్యం…

విజయవాడ, అక్టోబర్ 31: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విజయవాడ నగర అభివృద్ధికి మహర్దశ పట్టిందని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు, వరద ముంపు, డ్రైనేజీ వ్యవస్థ, మౌలిక సదుపాయాల కొరతకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతోందన్నారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో విజయవాడ అభివృద్ధికి చేపట్టిన వివిధ కార్యక్రమాలను ఆయన వివరించారు. నగరంలో రక్షణ గోడ నిర్మాణానికి రూ.200 కోట్లు, బౌండరీ వాల్‌కు రూ.28 కోట్లు, ప్రధాన డ్రైనేజీ పనులకు రూ.500 కోట్లు, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అభివృద్ధికి రూ.60 కోట్లు, ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణానికి రూ.105 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. నగరవ్యాప్తంగా సుమారు నాలుగు వేల అభివృద్ధి పనులకు రూ.300 కోట్లతో ప్రణాళికలు రూపొందించామని, అత్యవసర రక్షణ చర్యలకు మరో రూ.25 కోట్లు కేటాయించామని చెప్పారు. బౌండరీ వాల్ నిర్మాణాన్ని మూడు నెలల్లో పూర్తిచేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. కనకదుర్గమ్మ ఆలయం సమీపంలోని ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్, ప్రత్యామ్నాయ రహదారుల అభివృద్ధితో నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. గన్నవరం బైపాస్ మార్గాల ద్వారా భారీ వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడం, అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవే, విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి అభివృద్ధి ద్వారా ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందన్నారు. గన్నవరంలో హెచ్‌సీఎల్ సంస్థ ద్వారా సుమారు ఐదు వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మల్లవల్లి పారిశ్రామికవాడ అభివృద్ధితో మరిన్ని పరిశ్రమలు ఏర్పడి ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. గన్నవరం విమానాశ్రయం ఆధునికీకరణ, వీఆర్ సిద్ధార్థ ఫ్లైఓవర్, కాలువల సుందరీకరణ వంటి ప్రాజెక్టులతో విజయవాడ రూపురేఖలు మారనున్నాయని పేర్కొన్నారు. కృష్ణానది వరదల నుంచి లోతట్టు ప్రాంతాల ప్రజలను రక్షించేందుకు రిటైనింగ్ వాల్‌తో పాటు ఇతర వరద నివారణ పనులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో వరద నీటి మళ్లింపు చర్యలు చేపడుతున్నామని వివరించారు. కొండ ప్రాంతాలు, నివాస ప్రాంతాల్లో సుమారు లక్ష మందికి ధ్రువీకరణ పత్రాలు అందించడం, సింగ్‌నగర్ ప్రాంతంలో 25 వేల మందికి వస్త్రాల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. విజయవాడను అత్యాధునిక మౌలిక సదుపాయాలు, మెరుగైన రవాణా వ్యవస్థ, పారిశ్రామిక అభివృద్ధి, పటిష్టమైన వరద రక్షణ చర్యలతో కూడిన నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని బొండా ఉమా స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ సహకారంతో నగరాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామన్నారు. నగర సమగ్ర అభివృద్ధి కొనసాగాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

