రాప్తాడు నిందితుడు హేమంత్ కాలు తొలగింపు!
పోలీసుల కాల్పుల్లో కుడి కాలికి తీవ్ర గాయాలు… రక్తప్రసరణ నిలిచిపోవడంతో గ్యాంగ్రీన్గా మారిన పరిస్థితి… కోర్టు ఆదేశాలతో అర్ధరాత్రి శస్త్రచికిత్స చేసిన వైద్యులు…

అనంతపురం, నవంబర్ 3: రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన కేసులో నిందితుడు హేమంత్ కుడి కాలును వైద్యులు తొలగించారు. పోలీసుల కాల్పుల్లో అతడి కాలికి బుల్లెట్ గాయాలు కావడంతో రక్తప్రసరణ నిలిచిపోయి గ్యాంగ్రీన్ ఏర్పడినట్లు సమాచారం. కాలును అలాగే ఉంచితే ఇన్ఫెక్షన్ ఇతర భాగాలకు వ్యాపించి ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అర్ధరాత్రి తర్వాత అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు. హేమంత్ కుడి కాలులో మోకాలి కింది భాగాన్ని తొలగించినట్లు సమాచారం.

