బెజవాడలో మొదలైన ఓట్ల లెక్కింపు హడావుడి!
లయోలా కళాశాలలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు… గుర్తింపు పత్రాల పరిశీలన అనంతరం ఎజెంట్లకు ప్రవేశం… ఉదయం నుంచి కౌంటింగ్ కేంద్రం వద్ద సందడి…

విజయవాడ, నవంబర్ 3: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఆంధ్రా లయోలా కళాశాల వద్ద సందడి నెలకొంది. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే వివిధ రాజకీయ పార్టీల ఎజెంట్లు ఉదయం నుంచే కేంద్రానికి చేరుకున్నారు. అధికారులు వారి గుర్తింపు పత్రాలను పరిశీలించి లోపలికి అనుమతిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఒకేసారి అందరినీ అనుమతించకుండా ఒక్కొక్కరిని క్రమపద్ధతిలో లోపలికి పంపిస్తున్నారు. ఎజెంట్లు తమకు కేటాయించిన కౌంటింగ్ హాళ్లకు చేరుకునేలా అధికారులు చర్యలు చేపట్టారు. కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని నియంత్రిస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

