వీడియో కాల్లో తాత హత్యను చూసిన 13 ఏళ్ల మనుమరాలు!
17 ఏళ్ల ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడి... వెంటిలేటర్ ద్వారా ఇంట్లోకి ప్రవేశించి వృద్ధుడిని ఊపిరాడకుండా హత్య చేసినట్లు ఆరోపణ... ఐదుగురు మైనర్లు అదుపులోకి.. జువెనైల్ హోమ్‌కు తరలింపు...

తిరువనంతపురం: కేరళలోని అలప్పుజలో 67 ఏళ్ల వృద్ధుడి హత్య కేసు సంచలనంగా మారింది. 13 ఏళ్ల మనుమరాలు తన 17 ఏళ్ల ప్రియుడు, అతడి స్నేహితులతో కలిసి తాత హత్యకు కుట్ర చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. హత్య జరుగుతున్న సమయంలో బాలిక వీడియో కాల్లో చూస్తూ వారికి సూచనలు చేసినట్లు పోలీసులు గుర్తించినట్టు సమాచారం.
పోలీసుల దర్యాప్తు వివరాల ప్రకారం.. వృద్ధుడి చిన్న కుమార్తె ప్రసవం కోసం అలప్పుజలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరగా, ఆమెకు తోడుగా వృద్ధుడి భార్య వెళ్లింది. దీంతో వృద్ధుడు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకున్న బాలిక తన ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆగస్టు 15 రాత్రి బాలిక ప్రియుడైన 17 ఏళ్ల యువకుడితో పాటు మరో ముగ్గురు బాలురు ఇంటికి చేరుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. బాత్రూమ్ వెంటిలేటర్ ద్వారా లోపలికి ప్రవేశించిన వారు వృద్ధుడి కాళ్లు, చేతులు కట్టి, నోటిలో గుడ్డ కుక్కి, తలను గోడకు కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ముక్కు, నోరు గుడ్డతో మూసి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనను మనుమరాలు వీడియో కాల్లో వీక్షించినట్లు దర్యాప్తులో గుర్తించినట్టు సమాచారం. అనంతరం నిందితులు సుమారు 4.5 కాసుల బంగారాన్ని తీసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది.
మరుసటి రోజు బాలిక ఏమీ జరగనట్లుగా వ్యవహరించడం పోలీసుల దృష్టిని ఆకర్షించింది. సమీపంలోని దుకాణానికి వెళ్లి చిప్స్ కొనుగోలు చేయడంతో పాటు, తాత తలుపు తీయడం లేదని స్థానికులకు చెప్పినట్లు సమాచారం. ఆయన మద్యం సేవించి నిద్రపోతుండవచ్చని కూడా చెప్పినట్లు తెలుస్తోంది. అనంతరం బంధువులు గది తలుపు బలవంతంగా తెరిచి చూడగా వృద్ధుడు మృతి చెంది కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు.
ఇంట్లో బంగారం కనిపించకపోవడంతో తొలుత దొంగతనానికి వచ్చిన వారే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. అయితే సీసీటీవీ ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించడంతో కేసు మలుపు తిరిగినట్లు సమాచారం. బాలికతో పాటు ఆమె 17 ఏళ్ల ప్రియుడు, మరో ముగ్గురు మైనర్ బాలుర పాత్ర ఉన్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలుస్తోంది.
తాత తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, అందుకే ఆయనపై పగ పెంచుకున్నానని బాలిక విచారణలో చెప్పినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణపై స్వతంత్ర నిర్ధారణ జరగాల్సి ఉంది. మరోవైపు మొబైల్ ఫోన్, బైక్ కొనుగోలు కోసం డబ్బు సమకూర్చుకోవాలనే ఉద్దేశం కూడా నేరానికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం. యువకులు మాదకద్రవ్యాలు వినియోగించారా అనే కోణంలోనూ విచారణ సాగుతున్నట్లు తెలుస్తోంది.
మైనర్లు కావడంతో నిందితులను జువెనైల్ హోమ్‌కు తరలించినట్లు సమాచారం. కేసు తీవ్రత దృష్ట్యా తదుపరి చట్టపరమైన ప్రక్రియ కోసం జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు అంశాన్ని ఉంచనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, వృద్ధుడి చిన్న కుమార్తె అదే సమయంలో ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనివ్వడం కుటుంబంలో మరింత విషాదాన్ని నింపింది. ఒకవైపు మనుమరాలి జననం.. మరోవైపు అదే ఆసుపత్రి మార్చురీలో తాత మృతదేహం ఉండటం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కుంగదీసింది.

