మూగబోయిన మైనింగ్ శాఖ..!
ఇబ్రహీంపట్నం ఇసుక తవ్వకాలపై అధికారుల మౌనం లంక భూములు దెబ్బతింటున్నా స్పందించని సంబంధిత శాఖలు భారీ డ్రెడ్జింగ్ యంత్రాలతో కృష్ణా నదీగర్భంలో తవ్వకాలు ఇసుక రవాణాతో పవిత్ర సంగమం ప్రాంతంపై తీవ్ర ప్రభావం

ఇబ్రహీంపట్నం: కృష్ణా నదీ తీరంలోని ఇబ్రహీంపట్నం పరిసరాల్లో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై మైనింగ్ శాఖ అధికారులు ఎందుకు మౌనం పాటిస్తున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. భారీ యంత్రాలతో నదీగర్భంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖల నుంచి సరైన పర్యవేక్షణ కనిపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
లంక భూముల సమీపంలో తవ్వకాల కారణంగా నదీ పరివాహక ప్రాంతం దెబ్బతినే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇరిగేషన్ శాఖ కూడా స్పందించి, తవ్వకాలు నిబంధనలకు అనుగుణంగానే జరుగుతున్నాయా? అనుమతులు ఎంతవరకు ఉన్నాయి? అనే అంశాలను పరిశీలించాలని కోరుతున్నారు.
భారీ డ్రెడ్జింగ్ యంత్రాలతో కృష్ణా నదీగర్భం నుంచి ఇసుకను వెలికితీస్తున్న దృశ్యాలు కనిపిస్తున్న నేపథ్యంలో మైనింగ్, ఇరిగేషన్‌తో పాటు జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. అనుమతులకు మించి తవ్వకాలు జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని అధికారులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది.
మరోవైపు ఇసుక రవాణా వాహనాల రాకపోకలతో పవిత్ర సంగమం పరిసరాలు ఇసుక, దుమ్ముతో నిండిపోతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కృష్ణా–గోదావరి పవిత్ర సంగమం ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని తక్షణమే తనిఖీలు నిర్వహించి, నిబంధనల ఉల్లంఘన తేలితే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

