కుప్పకూలిన ఇల్లు.. తప్పిన ప్రాణాపాయం!
గుణదల విజయనగర్ కాలనీ కొండపై భారీ వర్షాలకు కూలిన రేకుల షెడ్డు... ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ముప్పు... హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన మాచవరం పోలీసులు...

విజయవాడ, అక్టోబర్ 28 : అర్నబ్ తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడలో ఓ నివాసం కుప్పకూలింది. అదృష్టవశాత్తూ ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుణదల విజయనగర్ కాలనీ కొండ ప్రాంతంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కొండపై నివసిస్తున్న బండ్రపల్లి వెంకటేశ్వరరావు (49)కు చెందిన రేకుల షెడ్డు మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు పూర్తిగా తడిసిపోయింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే తుఫాను నేపథ్యంలో పోలీసు శాఖ ముందస్తుగా జారీ చేసిన హెచ్చరికలతో నివాసితులు అప్రమత్తంగా ఉండటం, ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన గురించి సమాచారం అందుకున్న మాచవరం పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించి బాధితులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని నివాసితులను అప్రమత్తం చేశారు. మరోవైపు తుఫాను ప్రభావంతో కొండ ప్రాంతాల్లో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున పోలీసు యంత్రాంగాన్ని నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు అప్రమత్తం చేశారు. కొండ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తుఫాను ప్రభావం తగ్గే వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కొండవాలు ప్రాంతాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. అత్యవసర సహాయం కోసం డయల్ 112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు.
