కొండల చెంత పొంచి ఉన్న ముప్పు!
ఎడతెరిపి లేని వర్షాలతో కొండవాలు ప్రాంతాల్లో పెరుగుతున్న ప్రమాదం... మైక్ పట్టుకుని వీధివీధినా ప్రజలను అప్రమత్తం చేసిన మాచవరం పోలీసులు... ప్రాణాలే ముఖ్యం.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సీఐ చంద్రశేఖర్ సూచన...

విజయవాడ, అక్టోబర్ 28 : కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని మాచవరం సీఐ చంద్రశేఖర్ హెచ్చరించారు. అర్నాబ్ తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు కొండ ప్రాంతాల ప్రజలకు ప్రమాదకరంగా మారే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాలకు కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్నందున ముందస్తు జాగ్రత్తలే ప్రాణాలను కాపాడతాయని స్పష్టం చేశారు. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండ ప్రాంతాల్లో బుధవారం పోలీసు సిబ్బందితో కలిసి ఆయన పర్యటించారు. మైక్ ద్వారా స్థానిక ప్రజలకు ప్రమాద తీవ్రతను వివరిస్తూ అప్రమత్తం చేశారు. ముఖ్యంగా కొండలను ఆనుకుని నిర్మించుకున్న నివాసాల్లో ఉండేవారు భారీ వర్షాల సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఇళ్ల కోసం ప్రాణాలను పణంగా పెట్టొద్దు ఈ సందర్భంగా సీఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ కొండచరియలు ఎప్పుడు విరిగిపడతాయో ముందుగా అంచనా వేయడం కష్టమని, ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం ఉత్తమమని తెలిపారు. ఇళ్లు, సామగ్రి కంటే కుటుంబ సభ్యుల ప్రాణాలే ముఖ్యమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు. ప్రమాదకర ప్రాంతాల్లో నివసించే కుటుంబాలు అధికారుల సూచనల మేరకు సమీప పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని విజ్ఞప్తి చేశారు. తుఫాను ప్రభావం తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పోలీసు యంత్రాంగానికి సహకరించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని, సహాయం కోసం డయల్ 112ను సంప్రదించాలని సీఐ చంద్రశేఖర్ కోరారు.

