డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ గళం.. లోకేష్ రాజీనామా వరకు పోరాటం: ఆర్కే రోజా, భూమన
డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్.... విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం... నగిరి టౌన్‌హాల్ సమావేశంలో యువతను ఉద్దేశించి భూమన, ఆర్కే రోజా ప్రసంగం...

నగిరి, ఆగస్టు 5: రాష్ట్రంలో మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, వాటిపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో నగిరి టౌన్‌హాల్‌లో నిర్వహించిన సమావేశం ఉత్సాహభరితంగా జరిగింది. సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా హాజరై యువతను ఉద్దేశించి ప్రసంగించారు.
భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరిగే వరకు, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం ఆపబోదని స్పష్టం చేశారు. డీఎస్సీలో అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ, బాధితులకు న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు.
మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ, మెగా డీఎస్సీ పేరుతో ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసిందని ఆరోపించారు. చీకటి జీవోల ద్వారా అర్హులకు కాకుండా అనర్హులకు ఉద్యోగాలు కల్పించే పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు. డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించి, అనర్హులకు ఇచ్చిన ఉద్యోగాలను రద్దు చేసి అర్హులైన అభ్యర్థులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
అదే విధంగా ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి, వసతి దీవెన వంటి పథకాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, అవి అమల్లోకి వచ్చే వరకు విద్యార్థులు, యువత తరఫున వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర విద్యా వ్యవస్థ దెబ్బతిందని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన సౌకర్యాలు కూడా అందడం లేదని విమర్శించారు.
సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు రాహుల్ రాజారెడ్డి, రాష్ట్ర యువజన కార్యదర్శి కాయం గాంధీ, ఎస్‌ఐఆర్ రాష్ట్ర పరిశీలకులు వజ్రభాస్కర్ రెడ్డి, నియోజకవర్గ యువత అధ్యక్షుడు యువరాజ్, మండల యువత అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

