వివాహేతర బంధం.. రైలు పట్టాలపై విషాదాంతం!
భర్తతో విభేదాల నేపథ్యంలో ప్రియుడితో కలిసి వివాహిత ఆత్మహత్య… ఐదేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడిని వదిలి వెళ్లిన తల్లి… కర్ణాటకలోని మండ్య సమీపంలో ఇద్దరి మృతదేహాలు లభ్యం…

మండ్య, నవంబర్ 9 : కర్ణాటకలో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన వెలుగుచూసింది. భర్తతో విభేదాల నేపథ్యంలో ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. మండ్య తాలూకాలోని ఇండువాల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మండ్య తాలూకా గున్నైకనహళ్లి గ్రామానికి చెందిన సహాన (27) బెంగళూరులోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసేది. ఆ సమయంలో పావగడ సమీపంలోని అరసికెరెకు చెందిన ఆటో డ్రైవర్ వీరేశ్‌తో పరిచయం ఏర్పడి ప్రేమ వివాహం చేసుకుంది. దంపతులు బెంగళూరులో నివసిస్తున్నారు. వీరికి ఐదేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో రాపిడో బైక్ డ్రైవర్ రాహుల్‌తో సహానకు పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసినట్లు సమాచారం. విషయం భర్త వీరేశ్‌కు తెలియడంతో దంపతుల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. అనంతరం సహాన, రాహుల్ కలిసి మండ్యకు చేరుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 1.50 గంటలకు ఇండువాల్ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద ఇద్దరూ రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం. ఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మండ్య మిమ్స్ మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసుల విచారణలో మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

