పునరావాస కేంద్రాల్లో 313 మందికి ఆశ్రయం
తుపాను ప్రభావితుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు... ఆహారం, తాగునీరు, వైద్య సేవలపై నిరంతర పర్యవేక్షణ... ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దు: కలెక్టర్ లక్ష్మీశ...

విజయవాడ, అక్టోబర్ 28 : అర్నబ్ తుపాను ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లాలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో 313 మంది ఆశ్రయం పొందుతున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ వెల్లడించారు. తుపాను నేపథ్యంలో ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి పునరావాస ఏర్పాట్లను సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా 605 స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డుల పరిధిలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. తాగునీరు, ఆహారం, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రి భోజనం సక్రమంగా అందుతున్నాయా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పునరావాస కేంద్రాల్లో పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని, సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, మహిళలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. అవసరమైన వారికి తక్షణమే వైద్య సహాయం అందించాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు, సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.

