బెజవాడలో బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు!
రూ.5.84 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీ స్వాధీనం… బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతా మీదుగా హైదరాబాద్‌కు అక్రమ రవాణా… 3.147 కిలోల బంగారంతో పాటు డాలర్లు, యూరోలు పట్టివేత…

విజయవాడ, అక్టోబర్ 21: విజయవాడ శివార్లలో భారీ బంగారం స్మగ్లింగ్ వ్యవహారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు బట్టబయలు చేశారు. బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతా మీదుగా హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న రూ.5.84 కోట్ల విలువైన విదేశీ బంగారం, కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఐదుగురిని అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో హైదరాబాద్ జోనల్ యూనిట్, విజయవాడ రీజినల్ యూనిట్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. విజయవాడ శివార్లలో అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనాన్ని అడ్డుకుని తనిఖీ చేయగా రహస్య అరలో దాచిన 60 వేల అమెరికన్ డాలర్లు, 21,500 యూరోలు బయటపడ్డాయి. వాహనంలో ఉన్న ఇద్దరిని విచారించగా విజయవాడ శివార్లలోనే బంగారాన్ని అందజేసినట్లు, పట్టుబడిన విదేశీ కరెన్సీ అక్రమ బంగారం విక్రయానికి సంబంధించిన సొమ్ముగా అధికారులు గుర్తించారు. వారిచ్చిన సమాచారంతో హైదరాబాద్ వైపు బస్సులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురిని టోల్‌ప్లాజా వద్ద అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నడుముకు కట్టుకున్న ప్రత్యేక సంచుల్లో దాచిన మూడు విదేశీ బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 3,147.1 గ్రాముల బంగారం, విదేశీ కరెన్సీ విలువ రూ.5.84 కోట్లుగా నిర్ధారించారు. ఈ కేసులో అరెస్టయిన ఐదుగురిని న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అంతర్జాతీయ బంగారం అక్రమ రవాణా వ్యవహారంలో మరెవరి ప్రమేయం ఉందనే కోణంలో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

